అమ్మా! ఎక్కడున్నావమ్మా?

అమ్మా! ఎక్కడున్నావమ్మా?
అమ్మా ఎందుకమ్మా నాకీ జన్మ?

చిన్న వయసులో పెళ్లి చేసుకున్నావు..
ఏడు అడుగులు నడిచి వెళ్లావు...
ఏడాదిలోనే నాకు జన్మనిచ్చావు...ఉగ్గు పాలు పట్టావు...
తోలిచూరు బిడ్డగా ఎనలేని ప్రేమ పంచావు...
బీడిలు చుట్టి నా ఆకలి తీర్చావు...

అమ్మా! ఎక్కడున్నావమ్మా ?
అమ్మా ఎందుకమ్మా నాకీ జన్మ?

నన్ను చదువుల తల్లిగా చూడాలన్నావు...
చెల్లెళ్ళకు ఆదర్శం కావాలని అన్నావు...
నీ బ్రతుకు మాకోద్దన్నావు...
అందరు నిన్ను వద్దన్నా అందరు నీకు కావాలన్నావు..
అందరికి అందనంత సుదూర తీరాలకు వెళ్లావు..

అమ్మా! ఎక్కడున్నావమ్మా ?
అమ్మా ఎందుకమ్మా నాకీ జన్మ?

నీవు ఏదో అంటరాని రోగంతో చనిపోయావట..
అది మాకు వుందట...
మేమెవారికి వద్దంట.. ..
నువ్వు లేక నాన్న లేక మా జీవితాలకు ఇక దారి చూపేదెవరంట....
ఆదరించే దిక్కు లేక..ఆకలి పొట్ట పట్ట లేక..
చెల్లెళ్ళను చేరదీయలేక...బాధ్యతలను నెరవేర్చాలేక...
ఎలా అమ్మా ఈ బ్రతుకునీడ్చేది...ఎయిడ్స్ రగిల్చిన ఈ చిచ్చును ఆర్పేది...

అమ్మా! ఎక్కడున్నావమ్మా ?
అమ్మా ఎందుకమ్మా నాకీ జన్మ?
-------
చల్లా సుధా రాణి