Friday, February 24, 2012

మానవత్వం మనుషులకే సొంతం

ఉదయం నుండి పని చేసిన అలసట వొంటిని వోదల్లేదు.  ఆఫీసు నుండి బయటికి మూడ్ ఆఫ్ గ వచ్చాను. వేడి గా కాఫీ తాగాలనిపించి మినర్వా దగ్గర ఆగి కాఫీ తాగి కొంచం రిలాక్స్ అయ్యాను. 
ఏంటో ఆలోచనలతో మెదడంత గజిబిజి గా ఉంది. సరే ఇంటికి వెళ్లి కొంచం సేపు రెస్ట్ తీసుకుందామని త్వరగా బయలు దేరాను. బండి బంజారహిల్ల్స్ మీదుగా మెహిదీపట్నం వైపుకి వేగంగా వెళ్తోంది. ఫోన్ లో FM పెట్టుకొని వింటూ బండి డ్రైవ్ చేస్తున్నాను. 
"మనసు మూగది మాటలు రానిది..." మరో చరిత్రలో పాట వస్తోంది. చిన్న చిరునవ్వు నా మోహంలో...అలా ఆలోచిస్తూ మెహిదీపట్నం జంక్షన్ కి వచ్చాను...
అక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో నెమ్మదిగా వెళ్తున్నాను. నేను వెళ్ళే మలుపు దారిలో దూరంగా ఒక ముసలి వాడు క్రింద పడిపోయి వున్నాడు. 
"మన దగ్గర దొరికినంత దొంగ సారా వేరే ఎక్కడా దొరకదేమో..ఎక్కడపడితే అక్కడ తాగి ఇలా రోడ్డుకి అడ్డంగా పడిపోతారు. ఛః చ వీళ్ళు మారరు. సమాజం మారనీయదు." అనుకుంటూ ఆ ముసలి వ్యక్తి పక్కనుండి బండి పోనిచ్చాను. అలా వెళ్ళానో లేదో నా ఎదురు నుండి ఒక ముసలావిడ గుండెల మీద కొట్టుకుంటూ ఏడుస్తూ రావడం చూసాను. అప్రయత్నంగానే నా చేతులతో బండకి బ్రేక్స్ పడ్డాయి. బండి ఆపి ఆమె వెనకే వడి వడి గ వెళ్లాను. 
ఆ అవ్వ అతడి వద్దకు వెళ్లి తన బలమంతా కూడా కట్టుకొని లేపబోయింది. నేను వెనకగా వచ్చి నా చేతులతో అతడిని లేపడానికి ప్రయన్తినిచాను కాని నా  బలం అతడిని పూర్తిగా లేపడానికి సరిపోలేదు. అయ్యో అనుకుంటున్న సమయంలో ప్రక్కగా వెళ్తున్న తెల్లటి బెంజ్ కార్ మమ్మల్ని చూసి ఆగింది. ఆ కారులోనుండి నల్లటి సూట్ వేసుకున్న వ్యక్తి వేగంగా వచ్చి ఆ ముసాలడిని పట్టుకొని లేపాడు. అతని వెనక అతని డ్రైవర్ వచ్చి అతడిని పక్కకు తప్పించి మెల్లగా ఇతడిని నడిపించుకుంటూ ఆ పక్కన ఉన్న రాతి గట్టు మీద కూర్చో పెట్టారు. ఆ సూటు వేసుకున్న వ్యక్తి టైం చూసుకుంటూ "చలో చలో జల్ది జాన హాయ్. ఫ్లైట్ పకడ్నాహై" అంటూ డ్రైవర్ని పిలిచి కార్ ఎక్కి వేగంగా ఫ్లై ఓవర్ మీదకి వెళ్ళిపోయారు.  
నేను పక్కనే ఉన్న ఫుడ్ వరల్డ్ లోకి వెళ్లి ఒక వాటర్ బాటిల్ తెచ్చి మంచి నీళ్ళు తాగించమని అవ్వకిచ్చి "అసలేమైంది మామ్మా" అని అడిగాను. 
అవ్వ "పక్కనే ఉన్న రామా రావు నగర్ ఒల్దేజ్ హాం లో వుంటాంమమ్మ. కొడుకులు వదిలేస్తే మా పొట్ట మేము నింపుకోడానికి ఈ బస్తీకి వచ్చి ఇక్కడ వృద్దాశ్రమం లో ఉంటున్నాం మా... ఉదయం నుండి బాగా ఎండగా వుంది. అయినా చెప్పినా వినకుండా బస్టాప్ దగ్గర కొబ్బరి బొండాలు కొడతానని వచ్చాడమ్మ. సరే నేను వస్తాను పదా అని వెమ్మట వచ్చాను. ఇదిగో నన్నూ బండి దగ్గర నిలబెట్టి తను నీడపట్టున కూర్చుంటా అని వచ్చి ఇలా పడిపోయాడు. ఎంత చెప్పిన వినడు మా ఈ మనిషి. ఎప్పుడు పడి పోయాడో కూడా చూడని పాపిష్టి దాన్ని" అంటూ ఏడుస్తూ మెల్లగా అతనికి మంచి నీళ్ళు పట్టించింది. 

మెల్లగా అవ్వను ఆమె బండి దగ్గర వుంచి, తాతను పట్టుకొని పక్కనే ఉన్న ఆటోలో ఒల్దేజ్ హాం వద్ద దించి వచ్చి అవ్వకి చెప్పి నా బండి మీద తిరిగి ఇంటికి ప్రయాణమయ్యాను. నాతో పాటే నా ఆలోచనలు నన్ను వెంబడించాయి. 

అది రద్దీగా ఉన్న జంక్షన్. ఎంతో మంది బాటసార్లు, మోటార్ వాహనాలు, ట్రాఫిక్ పోలీసులు వుండే ప్రదేశం. కాని ఒక్కరు కూడా ఈ సంఘటనని చూడ లేదు. కనీసం అతడిని లేపడానికి సాయంగా కూడా రాలేదు. కారణం మన బడా మందు బాబులు. తాగి వొళ్ళు తెలియకుండా సోయి లేకుండా రోడ్ల మీద పడి బోర్లుతుంటే అటుగా చూస్తూ వెళ్ళే ప్రతి వాడికి వీళ్ళంటే అస్సహ్యమే. అందుకే తాగి కింద పడి పోయే వాడు... కష్టపడి శ్రమతో కళ్ళు తిరిగి కింద పడి పోయే వాడికి తేడా లేకుండా చేసారు చివరికి. చివరికి నేను కూడా అలా అనుకొనే మనసులో తిట్టుకుంటూ దాటి పోయాను. ఆ అవ్వ చెప్పిన మాటలకి నా మనసు బాగా కదిలిపోయింది. మనుషులని మనం చాలా తొందరగా అపార్ధం చేసుకుంటాం. తిరిగి అర్ధం చేసుకొనే లోపే మన చేతి సహాయాన్ని కోల్పోతాం. ఒకప్పుడు నేను షార్ట్ హ్యాండ్ నేర్చుకునే రోజులలో మా సర్ ఒక మాట చెప్పారు..."నీవు కళ్ళతో చూసింది సగమే నమ్ము చెవులతో విన్నది అసలే నమ్మకు". ఈ మాట ఆ క్షణం గుర్తుకు వచ్చింది. ఈ మాట అన్నిటికి వర్తించక పోయినా మానవ సంబందాలలో...మానవీయ కోణాలతో ఆలోచిస్తే మన అంతరాత్మే మన అనేక ఆలోచనలకి, అనుబంధాలకి పునరుద్దరణని, జవాబునిస్తుంది.  I Realized it... 

Helping Hand.....it may be yours to some one...hold it 
ఫ్రెండ్స్....జస్ట్ రోడ్ మీద సోయిలో లేకుండా ఎవరైనా పడి వుంటే ఒక నిమిషం ఆగి వారిని పరిశీలించి ముందుకు వెళ్ళండి. నాకెందుకులే అని మాత్రం వదిలి వేయకండి. ఎందుకంటే మీ చేతులతో పునర్జన్మ నిచ్చే అవకాశాన్ని మీరు జారవిడవనీయకండి. 

Sudha rani Challa

No comments:

Post a Comment